Nadendla : ఏపీలొ ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విశాఖపట్నంలో జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటి వరకు తొలి విడతలో దాదాపు 90 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

కొత్త సిలిండర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు
అంతేకాదు, రేపటి నుంచి (మంగళవారం) రెండో విడత కొత్త సిలిండర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో ఉచిత సిలిండర్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరం మొత్తం రెండు ఉచిత సిలిండర్లు లభించనున్నాయి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా, ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణ నగదు అందేలా చర్యలు తీసుకుంటోంది. రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన 24 గంటల లోపే వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.8,200 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గతంలో రైతులకు పంట కొనుగోలు చేసినప్పటికీ నగదు అందేందుకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కొత్త విధానంతో 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి వివరించారు.