చిన్న రుణ మొత్తాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయాలను తీసుకుంది. 50,000 రూపాయల వరకు ఉండే చిన్న రుణ మొత్తాలపై అధిక ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రాధాన్యత రంగాలు- ప్రత్యేకించి చిన్న మొత్తాల రుణాలపై దీన్ని వర్తింపజేసింది.
చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం..
50,000 రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలకు సంబంధించిన లేదా తాత్కాలిక సేవా ఛార్జీలు గానీ,ఇతర తనిఖీ ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక భారం నుండి చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం, ఈ పాలసీని మరింత సరళీకరించడంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఏప్రిల్ 1వ తేదీ అమలులోకి వస్తాయి
50 వేల రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలపై ఎలాంటి లోన్-సంబంధిత తాత్కాలిక సేవ ఛార్జీలు/తనిఖీ ఛార్జీలు ఇకపై ఉండబోవని తెలిపింది. తాజా ఆదేశాలు- ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే.. 2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వస్తాయి. ప్రాధాన్యత రంగ రుణాల కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి తీసుకున్న బంగారు ఆభరణాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వాటిని మినహాయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యాపార కార్యకలాపాల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునే వాళ్లు, రైతులు, బడుగు-బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందజేయడాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించినట్లు వివరించింది.
ఈ గైడ్‌లైన్స్ ప్రకారం..
ఈ కొత్త పీఎస్‌ఎల్ మార్గదర్శకాల వల్ల బ్యాంకుల జావాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం- ఒక ఆర్థిక సంవత్సరం త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లో, ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోగా ఈ పీఎస్ఎల్ రుణాలకు సంబంధించిన సమగ్ర డేటాను ఆర్బీఐకి అందజేయాల్సి ఉంటుంది. .