న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ సహా సమీప రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు దుప్పటి కారణంగా దృశ్యమానత జీరోకు పడిపోయింది. దీంతో రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై విజిబిలిటీ జీరోగా నమోదైంది. దీంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 220కిపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీతోపాటు నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వారణాసి, లక్నో, ఆగ్రా, పాట్నా, బరేలీ విమానాశ్రయాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఈ కారణంగా ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కోల్‌కతాలోని శుభాష్ చంద్రబోష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 19 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.