భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సులో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్చలు జరగనున్నాయి.
ఇది గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్ పర్యటించడం రెండోసారి. 2023 జులైలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్న మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ పర్యటన సందర్భంగా భారత రక్షణ రంగంలో ఒప్పందాలు కీలకంగా నిలిచాయి.
ఇదే విధంగా 2024 భారత రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో భారత-ఫ్రాన్స్ సంబంధాలకు మళ్లీ కొత్త ఊపొచ్చింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత బలపడుతున్నాయి.
మోదీ ఫిబ్రవరి పర్యటనలో కేవలం ఏఐ సదస్సుకు హాజరుకావడమే కాకుండా, భారత ఐటీ రంగం, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫ్రాన్స్‌తో సహకారాన్ని పెంచే విధానంపై చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సు ప్రపంచ దేశాల నుంచి అనేక ప్రముఖ నేతలను ఆకర్షిస్తోంది.
ప్రధాని పర్యటనకు సంబంధించి తుది షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌తో కొనసాగుతున్న సాన్నిహిత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం భారత అంతర్జాతీయ విధానంలో కీలకంగా నిలుస్తోంది. ఈ పర్యటనలో సైనిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.