తమిళ స్టార్ హీరో విశాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మదగదరాజ’ సినిమా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని టీమ్ చెప్పినప్పటికీ… ఆయనకు అసలు ఏంజరిగింది..? జ్వరం వస్తే ఇలా అయిపోతారా..? అంటూ అయన ఆరోగ్యం గురించి అభిమానులు వాకబు చేస్తూనే ఉన్నారు.
కాగా ‘వాడు వీడు’ మూవీ షూటింగ్ సమయంలో విశాల్ చెట్టుపై నుంచి కిందపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బ్రెయిన్లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కారణంగానే ఆయన ఈ స్థితికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
విశాల్ హీరోగా, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా ‘మదగదరాజ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించారు. 11 ఏళ్ల తర్వాత ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.