తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో మరణించిన భక్తుల పిల్లలకు తమ సంస్థల ద్వారా ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకారం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన యాత్రికులకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే, మృతుల బంధువులకు ‘కాంట్రాక్ట్’ ఉద్యోగాలను కల్పించాలని బోర్డు స్పష్టం చేసింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, “ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ ఘటన జరిగినందుకు బోర్డు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధ్యులపై న్యాయ విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
గాయపడిన 32 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి డిశ్చార్జ్ కాగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భక్తులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. బోర్డు సభ్యులు వి. ప్రశాంతి రెడ్డి, సుచిత్ర ఎల్లా ఒక్కొక్కరు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని, ఎంఎస్ రాజు రూ.3 లక్షల సహాయాన్ని ప్రకటించారు.
టీటీడీ ట్రస్ట్ బోర్డు, తొక్కిసలాట ప్రమాదం పునరావృతం కాకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు దృష్టి సారించనుందని తెలియజేశారు. మరణించిన భక్తుల పిల్లలకు తమ సంస్థల ద్వారా ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు.