కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధివైపుకు పరుగులు తీస్తోంది. తాజాగా వరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ (మామునూరు) విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.
వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని సీఎ రేవంత్ చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్‌లో వరంగల్ విమానాశ్రయం నుంచే రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. టెక్స్‌టైల్స్‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల అభివృద్ధితో హైదరాబాద్‌ను ప్రతిబింబించేలా వరంగల్ ఎదిగేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. వరంగల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాతరతో పాటు లక్నవరం, రామప్ప ఇతర పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రజలు సైతం దానినే వినియోగించుకుంటారని సీఎం రేవంత్ తెలిపారు.
ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలని, దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.