హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిన విధి విధానాలతో పాటు రేస్ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్‌ఎండీ ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు. అలాగే.. విడుదలైన నిధులు ఏ ప్రతిపాదికన జరిగాయనే కోణాల్లో ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.
కాగా, మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఈడీ విచారణ తర్వాత నేడు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బీఎల్‌ఎన్‌రెడ్డిపై ప్రశ్నలు సందించే అవకాశం ఉన్నది.