ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట 12 మందే అనుకున్నాం కానీ గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా నిలిచింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 16 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్లు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కోబ్రా సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టులతో తలపడటం వల్ల తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల అడ్డాలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల దాడులు తగ్గించడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటన తరువాత బోర్డర్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను నిరోధించేందుకు ప్రత్యేక బలగాలను నియమించారు.