మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ
ఇంఫాల్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధిస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలో ఉండటంతో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, తదుపరి ఏర్పాట్లు జరిగేదాకా సీఎంగా కొనసాగాలని బీరెన్‌సింగ్‌ను గవర్నర్ కోరారు.

అయితే.. బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదు. నాలుగు రోజులు పూర్తి కావడంతో కేంద్రం రాష్ట్రపతి విధించింది. మణిపూర్ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వేరే ముఖ్యమంత్రిని నియమించడం కన్నా.. కేంద్ర పాలన ఉండటం మంచిదన్న అభిప్రాయంతో రాష్ట్రపతి పాలన విధించారు.
కాగా, సీఎం రాజీనామాను గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆమోదించారు. అయితే కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు బీరేన్ సింగ్ తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని గవర్నర్ సూచించారు. అయితే, రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపిన గవర్నర్, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖలో అత్యున్నత స్థాయిలో సమీక్ష జరిపిన అనంతరం.. రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అసలే రాష్ట్రంలో కొంతకాలంగా ఘర్షణలు, విద్రోహకార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వర్గపోరాటాలు, సామాజిక అశాంతితో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం శాంతి నెలకొల్పేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి వాస్తవికంగా అమలుకాకపోవడంతో రాజీనామాకు బీరేన్ సింగ్ ఒప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.