అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో రూ.6,700 కోట్ల చొప్పున రుణాన్ని గతేడాది డిసెంబరులో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది.వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది.
మొదటి విడత
ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్ డెవల్‌పమెంట్ బ్యాంకు(ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి.మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్‌ఆర్‌బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. అలాగే, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విలువ రూ.16,871 కోట్లు. 31 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు . ఇక ఇక్కడ నిర్మాణ పనులు ఈ నెల రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

పనులు ప్రారంభం
ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని చేతుల మీదగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్దసంఖ్యలో కార్మికులు వస్తున్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే పనులు కూడా సమాంతరంగా సాగనుండడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు చేతినిండా పని ఉంటోంది. నిర్మాణాలకు ముందస్తు ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయా సంస్థలు బిజీగా ఉన్నాయి. గతంలో ఆగిపోయిన ప్రభుత్వ భవనాల వద్ద కార్మికుల కోసం భారీస్థాయిలో రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు.ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ కాంట్రాక్టు పొందిన కేఎంవీ సంస్థ ఆ నిర్మాణాలకు సమీపంలో షెడ్లు నిర్మిస్తోంది. రాజధానిలో ఈ-6 నిర్మాణ కాంట్రాక్టు తాజాగా పొందిన ఆర్‌వీఆర్ కంపెనీ తుళ్లూరు శివారులో గతంలో వేసిన షెడ్లను సకల సౌకర్యాలతో కార్మికుల కోసం సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు వెలగపూడిలో ఇటీవల కొన్న స్థలానికి పనులు ప్రారంభించింది.రాయపూడి కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఫిల్టర్ ట్యాంకు పైపులైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు కంప చెట్ల తొలగింపు,చదును చేయడం వంటి పనుల్లో పెద్దసంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు.