KTR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్పందించాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలు, ఫొటోలను కేటీఆర్ తన పోస్టుకు జత చేశారు. భూముల వ్యవహారంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయి. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయి. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నోరు విప్పరా?ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వ స్వాధీనంలో 400ఎకరాల భూమి
కాగా, టీజీఐఐసీ కంచ గచ్చిబౌలి భూములపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది. 400ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది అని టీజీఐఐసీ పేర్కొంది.