విశాఖపట్నంలో కొమ్మాది స్వయంకృషినగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి మృతి చెందగా కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి.యువతి తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. ఇక ఆ యువతి కూడా రక్తపు మడుగులోని కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు తల్లీ కుమార్తెలపై కత్తితో దాడి చేసిన తర్వాత ఆ ప్రేమోన్మాది అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు రంగంలోకి దిగారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబత్ర బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

అరెస్టు
ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడు నవీన్‌ను శ్రీకాకుళం జిల్లాలోని బుర్జు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో బుధవారం సీపీ మీడియాతో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.దీపిక, నవీన్‌ల మధ్య గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అయితే వారి వివాహానికి ప్రస్తుతం ఆమె ఇంట్లో పెద్దలు నిరాకరించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే నవీన్ దీపిక, ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి గాయపర్చి పరారయ్యాడన్నారు. ఈ దాడిలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు.
ఘటనా స్థలం
నేరానికి ఉపయోగించిన కత్తిని నవీన్ ఘటనా స్థలంలోనే వదిలివేసి పారిపోయాడని తెలిపారు. ఘటన అనంతరం అతను బైక్‌పై శ్రీకాకుళం వెళ్లిపోయాడని, మధ్యలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుస్తులు, బైక్ మార్చేశాడని సీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు.