పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘాటిస్తూనే ఉంటామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
“కాంగ్రెస్ అతి త్వరలో సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తుంది. సీఏఏ, ఆర్టీఐ, ప్రార్థనా స్థలాల చట్టం, ఎన్నికల నియమాలపై చేసిన సవరణలను గతంలో సుప్రీంకోర్టులో సవాల్ చేశాం. వాటిపై విచారణ జరుగుతోంది” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.

వక్ఫ్ బిల్లు ఆమోదంపై స్పందించిన మోదీ
మరోవైపు, పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ స్పందించారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని అన్నారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని వెల్లడించారు.
‘ఇదొక చారిత్రక మలుపు’
వక్ఫ్ సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడాన్ని చరిత్రాత్మక మలుపుగా మోదీ అభివర్ణించారు. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం సమష్టి అన్వేషణలో ఓ కీలక ఘట్టమని కొనియాడారు. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ” ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన, సమ్మిళిత భారత్‌ను కలిసి నిర్మిద్దాం” అని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఒక చారిత్రకమైన రోజు :అమిత్ షా
మరోవైపు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. “ఈ రోజు ఒక చారిత్రకమైన రోజు. పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డులు, ఆస్తులు మరింత జవాబుదారీగా, పారదర్శకంగా, న్యాయంగా మారనున్నాయి అని అమిత్ షా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇది సముచితం కాదు: మాయావతి
పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యతిరేకించారు. ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే బీఎస్పీ ముస్లిం సమాజానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ” ఈ బిల్లును ప్రజలకు అర్థం చేసుకోవడానికి, వారి సందేహాలను నివృత్తికి అదనపు సమయం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఉండాల్సింది” అని మాయావతి పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ముస్లింల భూమిని లాక్కోవడానికి తీసుకొచ్చిందని విమర్శించారు.