వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ సునీత నివాళులు అర్పించారు. పులివెందులలోని వివేకా సమాధి వద్ద ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, వివేకా హత్యకు ఆరేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో ఇప్పటికీ ట్రయల్ ప్రారంభం కాలేదని, నిందితుల్లో ఒకరు తప్ప మిగతావారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు.
సునీత ఆవేదన
ఈ కేసులో నిందితుల కంటే తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్టుగా అనిపిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు వరుసగా మృతిచెందుతున్నా, ఎవరూ స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానాలున్నాయని, వీరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. తమకు న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.2019లో సాధారణ ఎన్నికల సమయంలో మార్చి 14న రాత్రి వివేకా జమ్మలమడుగులో ప్రచారం నిర్వహించి, అనంతరం పులివెందులలోని ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు తెల్లారేసరికి ఇంట్లో హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినా, హత్యగా తేలింది. అదే ఏడాది మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎం అయ్యేముందు సీబీఐ విచారణ కోరిన జగన్, అనంతరం దాన్ని ఉపసంహరించుకోవడంతో, సునీత స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయం జరిగేంతవరకు తాము వెనక్కి తగ్గబోమని ఆమె తెలిపారు.

మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి (శనివారం) సరిగ్గా ఆరేళ్లు. ఈ కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వివేకా వాచ్‌మెన్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణం తాజాగా కలకలం రేపింది. ఇలా వివేకా హత్య నుంచి రంగన్న అనుమానాస్పద మరణం దాకా ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.
సీబీఐ తిరిగి దర్యాప్తు
సీబీఐ తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు సునీత తెలిపారు.న్యాయం కోసం తమ పోరాటం ఆగదని, చివరి వరకు ప్రయత్నిస్తామని సునీత స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ఆమె ఆకాంక్షించారు.ఆమె స్వయంగా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ, కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిజాలను వెలికి తీయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.వైఎస్ సునీత తన పోరాటంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, కొందరు కీలక వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా ఆరోపించారు. అయినప్పటికీ, ఆమె తన లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోలేదు.ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైన తర్వాత అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఇంకా పట్టుబడలేదని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.