వక్ఫ్ ( సవరణ) బిల్లు 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటలు కేటాయించామని, అవసరమైతే దీన్ని పొడిగిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కోరుకుంటోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని కేంద్రం చెబుతోంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు.

కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏంటి?
ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏంటి, వాటి ఆస్తుల మీద ఉన్న వివాదాలు ఏంటి, కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏంటి, వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలు ఏంటో తెలుసుకుందాం. వక్ఫ్ అంటే ఏమిటి?
ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి. భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన దిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 8,72,351వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9లక్షల 40వేల ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
సంస్కరణల అవసరం ఉందా?
వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేకమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు. భారత దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరం అని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్షా 20వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 2 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. “వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చెయ్యడం సాధారణంగా మారింది” అని సచార్ కమిటీ పేర్కొంది. “గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది” అని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్దీ సంఘటనలను తన నివేదికలో నమోదు చేసింది.
సంబంధించిన దాదాపు 120 పిటిషన్లు
గత రెండేళ్లలో దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్‌కు సంబంధించిన దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. వక్ఫ్ చట్టానికి చేస్తున్న మార్పులపై అనేకమంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరి కొన్నింటిని నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు. పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్( వినియోగించుకుంటున్న వ్యక్తి కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది. “అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే వాటి యాజమాన్య హక్కులు మొఘలుల కాలం నాటివి. అవి మొఘలుల నుంచి బ్రిటిషర్లకు వారి నుంచి నేటి తరం వరకు వచ్చాయి” అని షిక్వా-ఎ- హింద్: ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ పుస్తక రచయిత ప్రొఫెసర్ ముజిబుర్ రెహమాన్ చెప్పారు.
బోర్డుల్లోకి అన్ని మతాలకు చెందిన వారిని సభ్యులుగా
కొత్త బిల్లు ముస్లింల ఆందోళనను పట్టించుకోకపోవచ్చని, వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులను ముస్లింలనుంచి లాగేసుకుంటారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపాదిత సవరణల్లో వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో ముస్లిమేతరులను బోర్డులో సభ్యులుగా నియమించడం తప్పనిసరి అనే ప్రతిపాదన ఉండటమే వారి ఆందోళనలకు కారణం. మతపరమైన సంస్థల బోర్డుల్లోకి అన్ని మతాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకోవడానికి కొంతమంది అంగీకరిస్తున్నారు. దీని వల్ల లౌకిక భావన మరింత బలపడుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు మెజారిటీలకు అనుకూలంగా ఉన్నాయని ప్రొఫెసర్ రెహమాన్ అంటున్నారు.
ప్రతిపాదిత మార్పులు ఏమిటి?
వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్‌దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు.ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్‌ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే కొన్ని మార్పుల వల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది.
వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు
“అనేకమంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్లు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఒక ఛాన్స్ లభిస్తుంది” అని ఒవైసీ ఇటీవల రిపోర్టర్లతో చెప్పారు. బిల్లులోని ఇతర ప్రతిపాదనలలో షియా, సున్నీలతో పాటు బోహ్రా, అగాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడం కూడా ఉంది. ప్రస్తుత చట్టం ప్రకారం, వక్ఫ్ మొత్తం ఆస్తి, ఆదాయంలో షియా కమ్యూనిటికీ 15 శాతం వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యకం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని చెబుతున్నారు.