అభిషేక్ శర్మ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కలిసి విరుచుకుపడి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్ ) ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరు నమోదు చేశారు. హెడ్ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లో అర్ధ శతకం సాధించి అభిమానులను అలరించాడు.రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చిత్తు చేసిన ఇషాన్ కిషన్, వరుస సిక్సర్లతో మైలురాయిని చేరుకున్నాడు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్, ట్రావిస్ హెడ్ – అభిషేక్ శర్మ కలిసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ డేంజరస్ జోడీ 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించింది. అభిషేక్ ఔటైన తర్వాత ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వేగంగా స్కోర్‌ను పెంచుతూ వెళ్లారు.
టాక్ ఆఫ్ ది ఉప్పల్ గా ఇషాన్ కిషన్
హెడ్ పెవిలియన్ చేరిన తర్వాత, ఇషాన్ కిషన్ మరింత దూకుడు ప్రదర్శించాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భారీ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్, ఈ మైలురాయిని చేరుకున్న వెంటనే ఫ్లయింగ్ కిస్‌తో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్టేడియంలో ఉన్న ఎస్ఆర్ హెచ్ యజమాని కావ్య మారన్ కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఫామ్‌లోకి ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్, తన బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. ఈలోగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సంజు సామ్సన్ వంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చి తమ స్థానాలను బలపరచుకున్నారు.అయితే, ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్ ఇషాన్‌కి తిరిగి తన కెరీర్‌ను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వరుసగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందాలనే పట్టుదలతో ఉన్నాడు. అతని ప్రదర్శన చూసిన అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఇషాన్ రీఎంట్రీపై చర్చించుకోవడం ప్రారంభించారు.పీఎల్‌లో ఇషాన్ తన దూకుడు ఆటను కొనసాగిస్తే, త్వరలోనే టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకునే అవకాశాలు పెరుగుతాయి.