తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బ్యాలెట్ పేపర్ విధానం ఉండటంతో చిన్న పొరపాటు జరిగినా ఓటు చెల్లని ప్రమాదం ఉంటుంది. గతంలో కూడా అనేక మంది ఓటర్లు తగిన అవగాహన లేకపోవడంతో వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు సరిగా వేయాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి.

బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయడంలో ముఖ్యమైన నియమాలు
ఈ ఎన్నికల్లో ఇవీఎంలు లేకుండా, కేవలం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ జరుగుతుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. ముందుగా అత్యంత నచ్చిన అభ్యర్థికి “1” నెంబర్ ఇవ్వాలి. ఆపై ఇతర అభ్యర్థులకు 2, 3, 4 వంటివిగా ప్రాధాన్యత క్రమంలో నెంబర్ ఇవ్వవచ్చు. అయితే ఒకరికి కేటాయించిన సంఖ్య వేరొకరికి ఇవ్వరాదు. అలాగే రోమన్ సంఖ్యలు (I, II, III), అక్షరాలు (One, Two) వాడకూడదు. టిక్కులు () పెట్టడం, సున్నాలు గీయడం వంటి తప్పిదాలు చేస్తే ఆ ఓటు చెల్లదు.
పోలింగ్ కేంద్రంలో పాటించాల్సిన నియమాలు
ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు తప్పనిసరిగా ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. అంధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు. ఓటింగ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటైనా మీ ఓటును చెల్లనిదిగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే పూర్తి జాగ్రత్తలతో, నియమాలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.