అమెరికా బర్మింగ్‌హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.శనివారం సాయంత్రం 6:20 ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. కెల్లామ్ స్ట్రీట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న పది మంది తెలుగు విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.మంటలు మొదలైన వెంటనే భయంకరమైన పొగలు వ్యాపించాయి. ఊపిరి ఆడక విద్యార్థులు బీభత్సంగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు.ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.వాళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఇద్దరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగతా విద్యార్థులకు స్వల్ప గాయాలే కాగా, వారి పరిస్థితి నిలకడగా ఉంది.

వీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే.అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం అక్కడ ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో మంటలు అదుపు చేయాలని ప్రయత్నించామని చెప్పారు.కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో భయంతో బయటకు పరిగెత్తామని తెలిపారు.వెనుకవైపు డోర్ నుంచి పరుగులు తీయడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని, అది తమకు పునర్జన్మ అని పేర్కొన్నారు. వాళ్ల మాటల్లో భయం, కృతజ్ఞత రెండూ కనపడుతున్నాయి.మంటల కారణంగా అపార్ట్‌మెంట్ పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థులకి ఉన్న వస్తువులేమీ మిగల్లేదు. ఉన్న చోటుండే కాలిపోయింది. దాంతో వారంతా నిలువ నీడ లేకుండా పడిగాపులు పడుతున్నారు.ఈ వార్త తెలియగానే స్థానిక తెలుగు సంఘాలు రంగంలోకి దిగాయి. వారు తాత్కాలిక ఆశ్రయం, భోజనం అందిస్తున్నారు. అలబామా విశ్వవిద్యాలయం కూడా విద్యార్థుల రికవరీకి అవసరమైన సాయం అందిస్తున్నది.
MORE READ : Bandi Sanjay: మూడు పార్టీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు