ప్రేమలో పడటమే కాదు, జీవితాన్ని అనుభవించగలిగే తత్త్వం ఉండాలి. కానీ కొన్ని క్షణికావేశ నిర్ణయాలు, అనుభవం లేని వయస్సు కొన్ని ప్రాణాలను బలితీసుకుంటుంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రేమజంట ఆత్మహత్య ఘటన అందరినీ కలచివేస్తోంది. ప్రేమికులు తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే అనుమానంతోనే తమ జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, వారి కుటుంబ సభ్యులు మాత్రం ఈ ప్రేమ వ్యవహారం గురించి తమకు ముందుగా తెలియదని చెబుతున్నారు. దీనితో ఈ ఘటన మరింత మిస్టరీగా మారింది.

ప్రేమ ఎలా మొదలైంది?
ఇల్లందకుంట మండలంలోని రాచపల్లికి చెందిన రాహుల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. చదువును కొనసాగించకుండా ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. మరోవైపు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఎరువచింతలకి చెందిన గోలేటి శ్వేత కరీంనగర్ ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఓ ఈవెంట్ సందర్భంగా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ఇంట్లో వారికి చెప్పాలా వద్దా అనే ప్రశ్నలోనే వారు ఆత్మహత్య వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయం, భవిష్యత్‌పై అస్పష్టత వల్ల తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం ఈ ప్రేమ వ్యవహారం గురించి తమకు తెలియదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ట్రైన్ ట్రాక్‌పై విషాదాంతం
శివరాత్రి సందర్భంగా ఇంటికి వెళ్లిన శ్వేత తిరిగి కళాశాలకు చేరుకుంది. ఇదే సమయంలో, రాహుల్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. పరీక్ష పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. అప్పటికే కరీంనగర్ నుండి జమ్మికుంటకు వచ్చిన శ్వేతను కలిశాడు. వారి ప్రేమ విషయం బయటపడితే కుటుంబ సభ్యులు ఒప్పుకోరనే భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి శివారులో గల రైల్వే ట్రాక్ పైకి వెళ్లారు. అప్పటికే ట్రాక్ పై పడుకున్న వీరిని గూడ్స్ ట్రైన్ డ్రైవర్ చూసి హారన్ మోగించినా వారు లేవలేదు. ఆ తర్వాత జరిగిన దుర్ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇద్దరి కుటుంబ సభ్యులు వారి ప్రేమ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. రాహుల్ తండ్రి రాజు మాత్రం తన కుమారుడు ప్రేమ వ్యవహారం కారణంగా చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, శ్వేత తండ్రి రాజలింగు మాత్రం తన కుమార్తె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదని చెప్పడం మరింత మిస్టరీగా మారింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. కుటుంబ సభ్యుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రేమజంట ఆత్మహత్య వెనుక నిజంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉందా? లేక మరే ఇతర కారణం ఉందా? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి ఫోన్ల కాల్ రికార్డులు, మెసేజ్‌లు ఆధారంగా మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.