ఇంటర్ విద్యార్థులకు ముహూర్తం సన్నాహాలు పూర్తి.. రేపే ఫలితాల విడుదల!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య ఫలితాల విడుదల తేదీ, సమయాన్ని ఖరారు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాల ప్రకటన జరుగనుంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు ఫలితాల విడుదల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఫలితాలు తెలుసుకోవడానికి ఐవీఆర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. 9240205555 నంబర్‌కు కాల్ చేసి విద్యార్థులు తమ ఫలితాలను పొందవచ్చు.
పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల ప్రక్రియ ఎలా సాగింది?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1532 పరీక్ష కేంద్రాల్లో సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాగా, సెకండ్ ఇయర్‌లో 5 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10 వరకు 19 మూల్యాంకన సెంటర్లలో మూల్యాంకన కార్యక్రమం కొనసాగింది. ప్రతి మూల్యాంకన కేంద్రంలో 600 నుంచి 1200 మంది సిబ్బంది భాగస్వామ్యమై సమర్థవంతంగా పనిచేశారు. అధికారులు సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చి, నిర్ణీత గడువులోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తిచేశారు. దీంతో ఫలితాలను వేగంగా విడుదల చేసే అవకాశం లభించింది.
ఫలితాల వెల్లడి అనంతర ప్రాసెస్: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అవకాశాలు
విద్యార్థులు ఫలితాలను తనిఖీ చేసిన తర్వాత ఎవరికైనా సందేహాలు ఉంటే వారు రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా ఫలితాల ప్రకటన అనంతరం అధికారులు విడుదల చేయనున్నారు. పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు మళ్లీ అవకాశం ఇవ్వడానికి ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. నెలరోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా త్వరగానే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫలితాల ప్రకటనతో పాటు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల తేదీల వివరాలను స్పష్టంగా ప్రకటించనున్నారు.
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఈ వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results. cgg.gov.in లో ఎంటర్ చేసి ఫలితాలను చూడవచ్చు. అధికారిక వెబ్‌సైట్ మరియు ఐవీఆర్ ఫోన్ నంబర్ 9240205555 ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అధికారిక వేదికలనే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
read also: Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో ఆర్టీసీలో 3038 పోస్టులకు నోటిఫికేషన్