నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ తనకు చివరకు దక్కింది అవమానమేనని సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల సభలో బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 20 నెలలుగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణనాతీతమని భావోద్వేగానికి గురయ్యారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి రక్తం ధారపోస్తే, జీవితం చివరి దశలో కాంగ్రెస్ చూపిన వివక్ష తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. తన ఉసురు పోసుకున్న కాంగ్రెస్‌లో ఇక కొనసాగలేక, తనను గౌరవించి అండగా నిలిచిన కేసీఆర్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ అందించిన స్నేహహస్తం తన ప్రజా జీవితంలో ఒక కొత్త మలుపు అని ఆయన ప్రకటించారు.
Read Also : Chandrababu Birthday: మిత్రులకు మరియు పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు: చంద్రబాబు

కాంగ్రెస్ పాలనపై విమర్శలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో అమలు చేసిన అద్భుతమైన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిందని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రపంచం గర్వించేలా కేసీఆర్ తెచ్చిన ‘రైతుబంధు’ పథకాన్ని ఎగ్గొట్టి, రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే, దానికి తులం బంగారం కలుపుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఉన్న పథకాన్నే సరిగ్గా అమలు చేయలేక చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రస్తుత ప్రభుత్వం, రాష్ట్రానికి పట్టిన శనిలా మారిందని, ఆ శనిని వదిలించేందుకే తాను బీఆర్ఎస్‌లో చేరానని కుండబద్దలు కొట్టారు.
జగిత్యాల ప్రదాత కేసీఆర్
జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని జీవన్ రెడ్డి కొనియాడారు. జగిత్యాలను ప్రత్యేక జిల్లాగా మార్చడంతో పాటు, ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. బోర్నపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ. 70 కోట్లు మంజూరు చేయడం, గిరిజనుల రిజర్వేషన్లు పెంచడం, గురుకుల పాఠశాలల స్థాపన వంటి నిర్ణయాలు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని తెలిపారు. పదవుల కోసం తాను పార్టీ మారలేదని, తెలంగాణ సాధించిన ఉద్యమ రథసారథి కేసీఆర్‌తో కలిసి పనిచేసి, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామిని కావాలన్నదే తన లక్ష్యమని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.