హైదరాబాద్ శివార్లలో గంజాయి మత్తులో రెచ్చిపోయిన ముఠాలు
హైదరాబాద్ మహా నగరంలో ఇటీవల కాలంలో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్ అధికమవుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో చీకటి పడితే చాలు యువకులు గుంపులుగా చేరి మత్తు పదార్థాలను వినియోగిస్తూ, అనంతరం దారిలో వెళ్లే వాహనదారులను, పాదచారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ఇంటి నుంచి పారిపోయిన యువకులు, పర్యవేక్షణ కరవైన ఆకతాయిలు, మాదకద్రవ్యాలకు (For drugs) బానిసలుగా మారుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, డివైడర్లు, బస్టాపులు, మెట్రో, రైల్వేస్టేషన్ల వద్ద ఉంటూ దాతలు అందించే ఆహారం తీసుకుంటూ, కాలం వెళ్లదీస్తూ, మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత గంజాయి విక్రయిస్తున్నారు.
గంజాయి మత్తులో బైక్ ప్రమాదం – విదేశాల నుంచే డ్రగ్స్ మాఫియా ముడులు
తాజాగా హబ్సిగూడ (Habsiguda) సమీపంలో ఓ యువకుడు గంజాయి మత్తులో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిగూడ (Yellareddyguda) కు చెందిన అతడు గత కొంతకాలంగా మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తండ్రి పలుమార్లు మందలించినా అతడు మారలేదు. విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని చిన్నపాటి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, పెద్ద ముఠాల మద్దతుతో ఈ తరహా నేరాలు జరిగే అవకాశముందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దారిపొడవునా భయం – ఉద్యోగులపై రాళ్ల దాడి
హయత్‌నగర్ (Hayatnagar) సమీపంలోని భాగ్యలత కాలనీలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగులు విధులు ముగించుకొని ఇళ్లకు బయల్దేరుతుండగా, కొందరు యువకులు బైక్ పై వెంటపడుతూ ఉద్యోగులను డబ్బులివ్వమని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తిరస్కరించటంతో వారిపై రాళ్లతో దాడి చేశారు. సమీపంలోని ప్రైవేటు వసతి గృహంలోకి వెళ్లి దాడి నుంచి తప్పించుకున్నారు. బాధితుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రాకను గుర్తించిన ముఠా అక్కడి నుంచి పారిపోయింది.
గతంలో కూడా తీవ్ర ఘటనలు – దాడిలో వ్యాపారి మృతి
కేవలం తాజా సంఘటనలే కాదు, గతేడాది కొత్తపేటలో గంజాయి మత్తులో యువకుల ఆగడాలు భరించలేని ఒక వ్యాపారి అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఇటీవల కేపీహెచ్‌బీ కాలనీలో అర్ధరాత్రి మత్తు ముఠా వీరంగం సృష్టించింది. ప్రశ్నించిన యువకుడిపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు.
పాలక యంత్రాంగం స్పందించాలి – బాధితుల విజ్ఞప్తి
చీకటి పడితే చాలు ఒకేచోట చేరి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. మైకం తలకెక్కాక దారెంట వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. కొద్ది రోజులుగా మత్తుబాబుల ఆగడాలు శృతిమించడంతో వాహనదారులు, పాదచారులు హడలెత్తిపోతున్నారు. ఒంటరిగా వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా ముఠాలపై పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, వీరి ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. గంజాయి మత్తులో ఎంతకైనా తెగిస్తున్న ముఠాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Read also: Hyderabad: వీడియో గేమ్ కు బానిస..తల్లి మందలించడంతో ఆత్మహత్య