హైదరాబాద్: ఈరోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో.. కులగణన సర్వే రిపోర్టును ఆమోదిస్తారు. అలాగే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ సారధ్యంలోని ఏక సభ్య న్యాయ కమిషన్ సోమవారం ఇచ్చిన నివేదికను కూడా ఇవాళ క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అలాగే.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చిస్తారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే నెక్ట్స్ స్టెప్.
ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. వీటికి ఎమ్మెల్యేలంతా హాజరవ్వాలని కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులందరికీ చెప్పింది. ఎందుకంటే.. ఇవి అసెంబ్లీ బడ్జె్ట్ సమావేశాలు కావు. ప్రత్యేక సమావేశం. కులగణన సర్వే రిపోర్టును ఆమోదించడానికి ఏర్పాటు చేస్తున్న సమావేశాలు. కులగణన రిపోర్టును అసెంబ్లీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లను పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, ఆ తర్వాత కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. కులగణన సర్వేలో బీసీలు 55.85 శాతం ఉన్నట్లు సబ్‌కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దీని కోసం న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
శాసనమండలి, అసెంబ్లీలో తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.