న్యూయార్క్: న్యూయార్క్ నగరాన్ని కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. శనివారం లాంగ్ ఐలాండ్‌లోని హోంప్టన్స్‌లో ఈ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన గాలుల కారణంగా దట్టమైన పొగ ఆకాశమంతటా వ్యాపిస్తోంది. ఫలితంగా కొన్ని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. హోంప్టన్స్‌లో నాలుగు చోట్ల ఈ మంటలు పుట్టుకొచ్చాయి. మధ్యాహ్నం 1 గంటకల్లా మోరిచెస్, ఈస్ట్‌పోర్టు, వెస్ట్ హోంప్టన్స్‌తో సహా పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించాయి. దీంతో ఆ ప్రదేశాలు దట్టమైన పొగతో నిండిపోయాయి.

గాలులు వీయడంతో దట్టమైన పొగ
మూడు చోట్ల మంటలు అదుపులోకి తీసుకురాగా.. హోంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను ఆర్పేశారు. ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. అయితే, స్థానికంగా ఉన్న గృహాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో దట్టమైన పొగ నగరమంతా వ్యాపించింది. ఇక న్యూయార్క్ గవర్నర్ హోచుల్ అక్కడ అత్యవసరస్థితిని ప్రకటించారు. స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. పొగ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.