టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను ప్రధాని మోదీ కలిశారు. అమెరికా టూర్ వెళ్లిన మోదీ.. అక్కడ మస్క్‌తో భేటీ అయ్యారు. అయితే బ్లెయిర్ హౌజ్‌లో జరిగిన భేటీలో ముగ్గురు పిల్లలతో పాటు శివన్ జిలిస్ అనే మహిళ కూడా పాల్గొన్నది. మస్క్ పార్ట్నర్ శివన్ జిలిస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. మస్క్‌కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్‌లో ఉన్నతశ్రేణి ఉద్యోగం చేస్తోంది శివన్ జిలిస్. కానీ చాన్నాళ్ల నుంచి ఆమె గురించి ఎవరికీ తెలియదు. గడిచిన ఆర్నెళ్లలో ఆమె మస్క్‌తో కలిసి కనిపించడం ఇది రెండోసారి.
తల్లి భారతీయ సంతతి
శివన్ జిలిస్ వయసు 39 ఏళ్లు. కెనడాలో పుట్టిందామె. యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తల్లి భారతీయ సంతతి వ్యక్తి. ఆమె పేరు ఎన్ శారద. శివన్ జిలిస్ తండ్రి పేరు రిచర్డ్ జిలిస్. అతను కెనడా దేశస్థుడు. న్యూరాలింక్ కంపెనీలో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా జిలిస్ పనిచేసింది. 2017 నుంచి 2019 వరకు టెస్లా కంపెనీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా చేసిందామె. సామ్ ఆల్ట్‌మాన్‌కు చెందిన ఓపెన్ఏఐ కంపెనీకి అడ్వైజర్‌గా కూడా చేసింది. బ్లూమ్‌బర్గ్ బీటా కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ బృందంలో ఫౌండింగ్ మెంబర్‌గా ఉన్నది.

ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు
శివన్ జిలిస్.. 2015లో.. ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో చోటు సంపాదించింది. లింక్డిన్ అండర్35లో కూడా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ పార్ట్నర్‌గా శివన్ జిలిస్‌ను గుర్తిస్తారు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2021లో ఇద్దరు జన్మించారు. 2024లో మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ జంట తమ రిలేషన్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. తన 11 మంది పిల్లల కోసం నిర్మించిన టెక్సాస్ కాంపౌండ్‌లోకి శివన్ జిలిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.