కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబై పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా ఒక యూట్యూబర్‌లాగా వచ్చి వీడియోలు తీసుకుని వెళ్లిపోయాడని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ముంబై కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, రాహుల్ గాంధీ స్థానిక నేతలను కలవకుండానే తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు.శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ముంబైలో చాలా బలంగా ఉండేదని, కానీ ప్రస్తుతం పార్టీ ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోతుందన్నారు. ముంబై కాంగ్రెస్ నేతలను రాహుల్ గాంధీ పూర్తిగా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో గల అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నేతలపై ఉందని, కానీ రాహుల్ గాంధీ మాత్రం పార్టీకి సహాయం చేయకుండా తాను మాత్రమే ముందుకు వెళ్లిపోతున్నారని విమర్శించారు.
సంజయ్ విమర్శలు
రాహుల్ గాంధీ ఈ నెల 6న ముంబైలోని ధారావి ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా అక్కడి తోలు పరిశ్రమ కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నారు. స్థానిక పరిశ్రమలను పరిశీలించి, కార్మికుల నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ ముంబై నాయకులను కలవకపోవడం చర్చనీయాంశమైంది. సంజయ్ నిరుపమ్ దీనిని ఎత్తిచూపుతూ, రాహుల్ గాంధీ ముంబై కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
ఆర్థిక స్థితిపై ఆరోపణలు
సంజయ్ నిరుపమ్ ప్రకారం, ముంబై కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. విద్యుత్ శాఖకు పార్టీ కార్యాలయం దాదాపు రూ.5 లక్షల బకాయి పెట్టిందని, అలాగే కార్యాలయ అద్దె కూడా కొన్ని నెలలుగా చెల్లించలేకపోతున్నారని వెల్లడించారు. ఇటువంటి ఆర్థిక కష్టాల్లో ఉన్న పార్టీ నాయకత్వం స్థానికంగా మార్గదర్శకత్వాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తి
రాహుల్ గాంధీ తన పర్యటనల్లో స్థానిక నాయకులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పార్టీకి ఎదురవుతున్న సమస్యలను అర్థం చేసుకోవడంలో ఆయన ఆసక్తిని చూపడం లేదని సంజయ్ నిరుపమ్అన్నారు. ఓ వైపు ముంబై కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ సంక్షోభ స్థితిలో ఉంటే, మరోవైపు రాహుల్ గాంధీ స్థానిక నాయకులను కలవకుండానే వెళ్లిపోవడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లోపలి పరిస్థితులపై మరింత దృష్టిని ఆకర్షించాయి. ముంబై కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పార్టీ నాయకత్వంపై కలుగుతున్న అసంతృప్తి, రాహుల్ గాంధీ తీరుపై విమర్శలు కాంగ్రెస్ భవిష్యత్తుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.