శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ – 60 (PSLV C-60) వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా స్పేడెక్స్ ప్రయోగం చేపట్టారు. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ 2 ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.
ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మరో 24 పేలోడ్‌లను సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిల్లో 14 ఇస్రో, డీఓఎస్‌కు చెందినవి కాగా, 10 పేలోడ్లు ప్రభుత్వేతర సంస్థవి. కాగా, సోమవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగం ప్రారంభించాల్సి ఉన్నా అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యమై 10 గంటల 15 సెకన్లకు ప్రారంభమైంది. ఇస్రోకు ఇది 99వ ప్రయోగం. పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. ఉపగ్రహాలను వాహకనౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
ఇస్రో చేపట్టబోతున్న భవిష్యత్ ప్రయోగాలకు డాకింగ్ సామర్థ్యం అత్యంత కీలకం. చంద్రుడి పైకి వ్యోమగాములను పంపడానికి, చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను భూమి పైకి తీసుకురావడానికి డాకింగ్ సామర్థ్యం అవసరం. భారత్ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్) ఏర్పాటుకు, అంతరిక్షానికి భారత్ నుంచి మొదటి వ్యోమగామిని పంపించడానికి చేపట్టనున్న గగన్‌యాన్ ప్రయోగానికి సైతం డాకింగ్ అవసరం. స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.