విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తల్లి ప్రాణాలు కోల్పోగా, యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు.

దాడి ఘటన ఎలా జరిగింది?
ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న యువతి, నిందితుడు మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో నవీన్ కోపోద్రిక్తుడయ్యాడు. ఈ కోపంతోనే యువతిని కనబడిన చోటే చంపాలనే నిర్ణయానికి వచ్చాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన జరిగిన రోజు నవీన్ తనతో పాటు కత్తిని తీసుకొని బాధితురాలి ఇంటి వద్ద వేచి ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మాటలు కలిపి, ఆమెను బలవంతంగా తనతో వెళ్లిపోవాలని ఒత్తిడి చేశాడు. అయితే, యువతి నిరాకరించడంతో కోపంతో ఆమెపై దాడికి దిగాడు. ఆమె తల్లి తన కూతురిని రక్షించేందుకు ప్రయత్నించగా, నవీన్ ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచాడు. తల్లి గాయాల తీవ్రతతో ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల దర్యాప్తు & ప్రభుత్వ స్పందన
దాడి జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి తండ్రి చేసిన ప్రకటన ప్రకారం, నవీన్ గతంలోనూ యువతిపై దాడి చేశాడు. అయితే, కుటుంబం అప్పట్లో పెద్దల సమక్షంలో పరిష్కారానికి వచ్చిందని తెలిపారు.అప్పట్లో నవీన్ భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తాము పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుందని బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి త్వరితగతిన శిక్షపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సీపీ ప్రకారం, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌కు అప్పగించి తక్కువ సమయంలోనే తీర్పు వచ్చేలా చూడనున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త చట్టాలను తీసుకురావాలని పౌరసమాజం కోరుతోంది. విశాఖలో జరిగిన ఈ అమానుష ఘటన అందరికీ నిదర్శనం. నిందితుడు ముందుగానే శిక్షించబడితే ఈ ప్రమాదం తప్పేదని బాధిత కుటుంబం బాధపడుతోంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి మహిళా భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నవీన్ కత్తితో దాడి చేయడంతో స్పాట్‌లోనే చనిపోయిన యువతి తల్లి లక్ష్మి మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇంతటి అఘాతుకానికి ఒడిగట్టిన నవీన్‌కు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు యువతి తండ్రి. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో కేసు విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.