తెలుగు సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్‌లో అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన పోసాని, టీడీపీ, జనసేన నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయనపై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు
పోసాని అరెస్ట్ వార్త బయటకు రాగానే ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీసులు వైఖరి అన్యాయమని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో 352(2) 111 R/W (3)5 బీఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగానే రాయచోటి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.
పోసాని భవిష్యత్ ప్రస్థానం
ఇక, గతంలో పోసాని రాజకీయాలకు ఆసక్తి చూపించినప్పటికీ, గత ఎన్నికల అనంతరం పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జరిగిన అరెస్టు నేపథ్యంలో, పోసాని భవిష్యత్ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పలువురిపై విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోసాని అరెస్టు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.