హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న ప్రముఖ స్టార్ హోటల్ పార్క్ హయత్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ హోటల్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అప్రమత్తత నెలకొంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన హోటల్ గెస్టులను, సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మంటలు మొదటి అంతస్తులో ఉద్భవించినట్టు తెలిసింది.

మంటలు ఎగిసిపడిన దృశ్యం
హోటల్‌లో మంటలు ఒక్కసారిగా భగ్గుమంటూ వ్యాపించాయి. పెద్దఎత్తున పొగలు మేడల మధ్యన వ్యాపించి హోటల్ మొత్తం దట్టంగా కమ్మేసాయి. ఈ కారణంగా హోటల్ సిబ్బంది తక్షణమే అతిథులను అప్రమత్తం చేసి బయటకు తీసుకెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందన
ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది. ఫైర్ సిబ్బంది అత్యవసరంగా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం మూడు అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరాయి.
ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదుకు ఊహించని షాక్
ఈ ప్రమాద సమయంలో సన్‌రైజర్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్లేయర్లు ఆరో అంతస్తులో ఉన్నారు. వెంటనే ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ కోసం గత కొన్నిరోజులుగా సన్‌రైజర్స్ ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ ఇక్కడే బస చేస్తున్నారు. ఇవాళ్టి సంఘటన కారణంగా వారు వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు.
Read also: Hunters: వేటగాళ్లకు చట్టాన్ని చుట్టంగా మార్చిన అటవీశాఖ అధికారులు