తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతూ, రాబోయే మూడు రోజులకు వర్ష సూచన ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం కూడా పడొచ్చని అధికారులు హెచ్చరించారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ
నేడు కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాలు
హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆకస్మిక వర్షాలకు సిద్ధంగా ఉండాలని, అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని సూచిస్తున్నారు.
రేపటికీ వర్ష సూచన
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రేపటికి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుకున్న దానికంటే అధిక వర్షపాతం నమోదైతే, వరద ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.