Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. నగరంలోని ఆయన 3 ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

ఏప్రిల్ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు
అక్రమ మైనింగ్, రవాణాకు పాల్పడ్డారంటూ పొదలకూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో సోమవారం విచారణకు ఆయన రాకపోవడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని ఇళ్లలోనూ కాకాణి ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి ఇంటి గోడకు నోటీసులు అంటించారు.
నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణ
కాగా, ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడం, వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.