ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో కులవివక్ష(Caste discrimination) కలకలం రేపుతోంది. శిక్షణలో ఉన్న ఓ పైలట్(Pilot) ను ఇండిగో సంస్థలోని ముగ్గురు ఉన్నతాధికారులు ఘోరంగా అవమానించి, వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడ్ని కులం పేరుతో దూషించిన ఆ ముగ్గురు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదయ్యింది. దళిత సామాజిక వర్గానికి చెందిన శిక్షణ పైలట్ (35) ఇండిగో సంస్థలో కులవివక్షపై బెంగళూరు పోలీసులకు తొలుత ఫిర్యాదు చేయడంతో అక్కడ ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేశారు. అక్కడ నుంచి ఈ కేసును ఇంఢిగో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్‌కి బదిలీ చేశారు.

‘‘నీకు విమానం నడిపే అర్హత లేదు.. పోయి చెప్పులు కుట్టుకో…
ఏప్రిల్ 28న గురుగ్రామ్‌లోని ఇండిగో విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో శిక్షణాధికారి తన పట్ల నీచంగా మాట్లాడినట్టు బాధితుడు వాపోయాడు. ‘‘నీకు విమానం నడిపే అర్హత లేదు.. పోయి చెప్పులు కుట్టుకో… నువ్వు ఇక్కడ గుమస్తా ఉద్యోగానికి కూడా పనికిరావు’ అంటూ పరుషమైన పదజాలంతో అవమానించడాని పైలట్ ఆరోపించారు. తన సామాజిక స్థితిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
చిన్న చిన్న కారణాలకే నోటీసులు
అనవసరమైన శిక్షలు, వేతనంలో అన్యాయంగా కోతలు, చిన్న చిన్న కారణాలకే నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో ‘వృత్తిపరమైన హింస’కు పాల్పడ్డారని ఫిర్యాదులో బాధితుడు తెలిపాడు. ‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు కేవలం అవమానకరమైనవే కాదు.. నా సామాజిక స్థితిని చిన్న చూపు చూసే ఉద్దేశంతో చేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది.. మాటల దాడి మాత్రమే కాదు, వృత్తిపరమైన వేధింపులు కూడా కొనసాగాయి’ అని అన్నారు. దీనిపై పై అధికారులతో పాటు ఇండిగో ఎథిక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధిత ట్రెయినీ పైలట్ ఆరోపించాడు. దాంతో చివరికి ఎస్సీ/ఎస్టీ సెల్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించాడు.
అయితే, ఈ ఆరోపణలపై ఇండిగో ఇంకా స్పందించలేదు. కానీ, దాని అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ‘కుల, మత, లింగ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, శారీరక వైకల్యం, కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా వైవిధ్యం, సమానత్వం కోసం మేము ప్రయత్నిస్తుంటాం’ అని పేర్కొనడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు తపస్ దే, మనీష్ సహ్నీ, కెప్టెన్ రాహుల్ పాటిల్ అనే ముగ్గురు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Read Also: Vande Bharat Train: రైలులో సీటు మారేందుకు గొడవ .. ప్రయాణికుడిపై ఎమ్మెల్యే వ్యక్తుల దాడి