పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మలుపు చోటుచేసుకుంటోంది. గత పదేళ్లుగా బెంగాల్ గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్‌కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం బెంగాల్ కోటపై కాషాయ జెండా రెపరెపలాడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఊహించని రీతిలో దూసుకుపోతోంది. మొత్తం 294 స్థానాలకు గాను ఇప్పటికే బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ (148)ను దాటేసింది. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 107 స్థానాలకే పరిమితమై గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోతోంది. కాంగ్రెస్ 4, లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి. బెంగాల్ ఓటరు ఈసారి స్పష్టమైన మార్పును కోరుకున్నట్లు పోస్టల్ బ్యాలెట్ మరియు ప్రారంభ ఈవీఎం రౌండ్ల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also : భవానీ పూర్ లో మమతా వెనుకంజ

కోల్‌కతాలో నిశ్శబ్దం.. ఢిల్లీలో సంబరాలు
ఫలితాల సరళిని బట్టి కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రస్తుతం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గత ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసినప్పుడు కనిపించిన సందడి, కార్యకర్తల హడావిడి ఈసారి ఎక్కడా కనిపించడం లేదు. నాయకులు, కార్యకర్తలు ఫలితాలను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే, దీనికి భిన్నంగా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం మొదలైంది. బెంగాల్ గడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని భారీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. కార్యాలయంలో జిలేబీలు, మిఠాయిలు సిద్ధం చేయిస్తూ విజయ గర్వంతో కమలనాథులు ఉప్పొంగిపోతున్నారు.
దీదీ కోటలో ‘మార్పు’ మొదలైందా?
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పెరిగిన వ్యతిరేకత బీజేపీకి వరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పుంజుకోవడం, ఓట్ల చీలిక తగ్గడం వంటి అంశాలు ఆ పార్టీకి కలిసి వచ్చాయి. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించి చేసిన ప్రచారం ఇప్పుడు ఫలితాలనిస్తోంది. మధ్యాహ్నానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడితే, బెంగాల్ రాజకీయాల్లో ‘దీదీ’ శకం ముగిసి ‘కాషాయ’ పాలన మొదలవుతుందా అన్నది అధికారికంగా తేలిపోనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :