సింధూ జలాల ఒప్పందంపై అమిత్ షా సంచలన ప్రకటన: పాకిస్థాన్‌కు ఇక నీటి కష్టాలే!
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునఃప్రారంభించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని, ఇన్నాళ్లూ అన్యాయంగా నీటిని పొందిందని, ఇకపై ఆ దేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, “అంతర్జాతీయ (International) ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారతదేశానికి (India) ఉంది. మేం అదే చేశాం” అని బలంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే అంశం ఉందని, అయితే ఒకసారి దాన్ని ఉల్లంఘించిన తర్వాత రక్షించడానికి ఏమీ మిగలదని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

భారత హక్కు: రాజస్థాన్‌కు జలాల మళ్లింపు
భారతదేశానికి హక్కుగా దక్కిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కాలువను నిర్మించి పాకిస్థాన్‌కు వెళ్లే జలాలను రాజస్థాన్‌కు మళ్లిస్తామని అమిత్ షా (Amit Shah) వివరించారు. “ఇంతకాలం పాకిస్థాన్ (Pakistan) అన్యాయంగా నీటిని పొందింది. ఇకపై ఆ దేశం గొంతు ఎండిపోవాల్సిందే” అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత భూభాగం గుండా ప్రవహించే నదుల జలాలపై భారత్‌కు సార్వభౌమాధికారం ఉందని, దానిని వినియోగించుకునే పూర్తి హక్కు ఉందని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. ఇది భారతదేశ ప్రయోజనాలను కాపాడటంతో పాటు, పాకిస్థాన్‌కు తమ ఉగ్రవాద చర్యల పట్ల గట్టి సందేశం పంపే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా కనబడుతోంది. రాజస్థాన్‌కు జలాల మళ్లింపుతో ఆ రాష్ట్రంలో సాగునీటి సమస్య తీరడంతో పాటు, వ్యవసాయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం: ఆర్థిక, వ్యవసాయ రంగాలపై దెబ్బ
1960వ దశకంలో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం పాకిస్థాన్‌కు అత్యంత కీలకమైనది. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం పాకిస్థాన్(Pakistan)కు తీవ్ర పరిణామాలను సృష్టిస్తోంది. పాకిస్థాన్ నీటి సరఫరా వ్యవస్థ ప్రధానంగా సింధూ జలాలపైనే ఆధారపడి ఉంది. ఆ దేశ వ్యవసాయానికి వినియోగించే నీటిలో దాదాపు 80 శాతం ఈ ఒప్పందం ద్వారానే లభిస్తోంది. అంతేకాకుండా, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 25 శాతం ఈ నదీ జలాల కారణంగానే వస్తుందంటే, భారత తాజా నిర్ణయం భవిష్యత్తులో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపనుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయం కుంటుపడటం, తాగునీటి కొరత వంటి సమస్యలు పాకిస్థాన్‌ను చుట్టుముట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదని, పాకిస్థాన్ ఆర్థిక, సామాజిక స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేసే అంశంగా మారుతుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
Read also: Honeymoon Murder: రఘువంశీ హంతకులని పట్టించిన చిరిగిన రూ.10 నోటు