బాలీవుడ్ చిత్రం ఛావా విడుదల తర్వాత మహారాష్ట్రలో మెఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. నాగ్ పూర్ లో భజరంగ్ దళ్ నేతలు చేశారని చెబుతున్న ఓ పనితో ఈ అల్లర్లు చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కాస్తా మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది.

అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగమేనా?
నాగ్ పూర్ లో చెలరేగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిన కుట్రేనంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఆరోపించారు. అల్లర్ల సందర్భంగా కొందరు భారీగా రాళ్లు రువ్వారని, పోలీసుల్ని గాయపర్చారని, పోలీసులపై దాడుల్ని సహించేది లేదని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ముస్లిం వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని కూడా నమోదు చేసుకున్నట్లు ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.
ఓ వర్గం ప్రజల్ని టార్గెట్ చేసుకునే ఈ అల్లర్లు జరిగాయని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఆరోపించారు. దేశభక్తి కలిగిన ముస్లింలు ఔరంగజేబును సమర్ధించబోరన్నారు. ఆయన్ను సమర్థించే వారంతా దేశద్రోహులన్నారు. ఔరంగజేబు ఎవరు, ఆయనేమైనా సన్యాసా ? ఏవైనా మంచి పనులు చేశాడా అని షిండే ప్రశ్నించారు. ప్రజలు ఛత్రపతి శంభాజీ చిత్రాన్ని చూడాలని, ఆయన చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ప్రజలు పుకార్లు నమ్మకుండా సంయమనం పాటించాలన్నారు.
నాగ్ పూర్ కు మణిపూర్ గతి
శివసేన నేత ఆదిత్య థాక్రే అల్లర్లపై స్పందిస్తూ.. నాగ్ పూర్ ను మణిపూర్ లా మార్చాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఇలాంటి వాతావరణంలో మణిపూర్ లో పర్యాటక రంగం అటకెక్కిందని, ఇప్పుడు ఇక్కడా అలాంటి పరిస్ధితులు వచ్చేలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కుట్రగా దీన్ని ఉద్ధవ్ సేన నేత ఉద్ధవ్ థాక్రే అభివర్ణించారు.