ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. “అంతరిక్షమైనా, కృత్రిమ మేధస్సయినా (AI) భారత్ ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ రంగాల్లో భారతీయుల భాగస్వామ్యం గర్వించదగినది” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కైలాష్, గిరిజన భాషల పరిరక్షణలో తనదైన పాత్ర పోషించారని, ప్రత్యేకంగా కొలామి భాష కోసం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు.

ఆయన చేసిన ఈ కృషి భవిష్యత్ తరాలకు అమూల్యమైనది
కైలాష్, కొలామి భాష పరిరక్షణ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించి పాటను కంపోజ్ చేశారు. గిరిజన సంస్కృతి, భాషలను రక్షించేందుకు ఆయన చేసిన ఈ కృషి భవిష్యత్ తరాలకు అమూల్యమైనది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AI టెక్నాలజీ ద్వారా భాషా పరిరక్షణలో కొత్త మార్గాలను కనుగొనడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.
కైలాష్ చేసిన కృషి ఆదర్శప్రాయమని ప్రధాని మోదీ
తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 50,000 మంది కొలాం తెగవారు ఈ భాషను మాట్లాడతారు. వారి భాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కైలాష్ చేసిన కృషి ఆదర్శప్రాయమని ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ భాషల సంరక్షణకు ఇదొక మంచి మార్గదర్శకం అవుతుందని ఆయన పేర్కొంటూ, ఈ తరహా విశిష్ట కృషిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.