ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్‘. లవ్, కామెడీ, యూత్ కంటెంట్‌ను ప్రధానంగా పెట్టుకొని రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.సాక్‌నిక్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వసూళ్లు గమనార్హంగా ఉన్నాయి. మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్, రూ.10.10 కోట్ల గ్రాస్ సాధించగా, ఓవర్సీస్‌లో రూ.7.90 కోట్లు రాబట్టింది. రెండో రోజు భారతదేశంలో రూ.7.5 కోట్ల నెట్ వసూలు చేయగా, మూడో రోజు రూ.9.25 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.6.25 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.

మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ.3.35 కోట్ల నెట్ రాబట్టింది.వీటికి మరిన్ని లెక్కలు చేరడంతో 4 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.ఇలా చూసుకుంటే మొదటి ఐదు రోజుల్లోనే ‘మ్యాడ్ స్క్వేర్’ ఇండియాలో రూ.34.85 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు దాటి అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించగా, నైజాంలోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. మిగతా ఏరియాల్లో చిన్న మొత్తంలో కలెక్షన్లు పెరుగుతుండటంతో సినిమా త్వరలోనే లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1.5 కోట్లకు పైగా లాభాలను అందుకుంది.సినిమాకు మంచి స్పందన దక్కుతుండటంతో రాబోయే రోజుల్లో మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాతల ప్రకారం, సినిమా మూడో రోజుకే రూ.50 కోట్ల మార్కును దాటింది. నాలుగో రోజుకల్లా ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వెల్లడించారు.
వసూళ్ల లెక్కల్లో ఎలాంటి తేడాలు లేవని స్పష్టం చేస్తూ, ప్రేక్షకుల ఆదరణ అద్భుతంగా కొనసాగుతోందని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో 450, ప్రపంచవ్యాప్తంగా 650 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో, హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భీమ్స్ సిసిరోలియో పాటలు అందించగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.