తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన ఈ దీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను కలిసిన కేటీఆర్, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, సీఎం పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొడంగల్‌లో ఉపఎన్నిక జరిగితే బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీ రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

రైతుల సమస్యల గురించి ప్రస్తావించిన కేటీఆర్, బీఆర్‌ఎస్ హయాంలో రూ.73,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికీ 25% మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. ఒక్క గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
అదానీ, అనుముల అన్నదమ్ముల కోసం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో రైతుల భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లగచర్ల భూములను తన అల్లుడికి కట్నంగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులపై అక్రమ కేసులు పెట్టి భూములు లాక్కొవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్ మాత్రం రైతులను మోసం చేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నిజంగా రైతుల కోసం కృషి చేస్తే, ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మొత్తం మీద, కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.