హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం చుట్టూ ఇప్పుడు రాజకీయంగా వేడి రాజుకుంటోంది. రూ.10 వేల కోట్ల స్కాం ఉందంటూ తెరపైకి లాగిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. “48 గంటల్లో కుంభకోణాన్ని బయటపెడతానన్న కేటీఆర్ ఇప్పటిదాకా ఏం చేశాడు?” అంటూ నిలదీశారు.కేటీఆర్ వదిలిన ఆరోపణలు పెద్ద హైడ్రోజన్ బాంబులా పేలతాయని ప్రజలు అంచనా వేశారని, కానీ చివరకు అవి ఉల్లిగడ్డ బాంబులా కూడా పేలలేదని చామల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోందని, దీనికి ప్రజల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అసహనంతో ఇలా ఆరోపణలకు దిగజారాడని విమర్శించారు.

బిల్లీరావుతో కేటీఆర్ కుట్ర చేసినట్టు ఆరోపణ
ఈ భూముల కుంభకోణం వెనుక కేటీఆర్ పాత్ర ఉందని, బిల్లీరావుతో కలిసి వీటిని తమవైపు తిప్పుకోవాలన్న యత్నం జరిగిందని చామల పేర్కొన్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమవడంతో, మీడియా సమావేశం పెట్టి అసంతృప్తిని వ్యక్తపరిచారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎంపీ పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
భూముల వ్యవహారంలో ఎవరో ఎంపీ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఆ ఎంపీ పేరు మాత్రం వెల్లడించకపోవడం పట్ల చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజల ముందుకి వచ్చినప్పుడు నిజాలు స్పష్టంగా చెప్పాలి, అర్థం కానివి చెప్పి ప్రజలను మోసం చేయకూడదు” అని ఆయన హితవు పలికారు.ఈ వివాదం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేటీఆర్ రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలు దగ్గరపడుతుండగా, ఈ తరహా ఆరోపణలు చేయడం వారి వ్యూహం అని తేల్చేశాయి.