టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతుండటం ప్రాధాన్యంగా మారింది. ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఇతర ఆస్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గత మూడు రోజులుగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ తనిఖీలు జరగడంతో పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఈ దాడుల వెనుక ఉద్దేశం ఏమిటి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, ఇతర బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు ముగించారు. వారి ఆస్తుల వివరాలు, లావాదేవీలపై అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా తెలియరాలేదు. దిల్ రాజు నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలోనే కాకుండా, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని వారం రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసి ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది.