నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం సహా ఇరాన్(Iran)లోని అణు స్థావరాలను ఇజ్రాయెల్(Israel) ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో తెహ్రాన్(Tehran)లోని అణు శాస్త్రవేత్తలు, టాప్ మిలటరీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని హతమార్చింది. శాంతియుత కార్యక్రమాలకు ఉద్దేశించిన తమ అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ విచక్షణా రహిత దాడులను ఖండిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్పారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ వైమానిక దాడులు చేసింది. నతాంజ్ అణు స్థావరాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు అరాగ్చి చెప్పారు. ఈ అణు కేంద్రం మీద జరిగిన దాడి వల్ల రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉందన్నారు. తమదేశ భద్రత కోసం ఈ ఆపరేషన్ తప్పనిసరని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడానికి కారణాలు వివరిస్తూ “ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని ఆపకుంటే, త్వరలోనే అణు బాంబు తయారు చేస్తుందని” నెతన్యాహు చెప్పారు. “ఇందుకు ఇరాన్‌కు ఏడాది పట్టవచ్చు లేదా కొన్ని నెలల్లోనే ఇది పూర్తి కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.

పదార్థాలను ఉత్పత్తి సాగించిన ప్రయత్నాల్లో పురోగతి
“అణు బాంబు తయారీకి అవసరమైన పదార్థాలను ఉత్పత్తి చేసేందుకు సాగించిన ప్రయత్నాల్లో ఇరాన్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తమ వద్ద సమాచారం ఉందని” ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అణు విస్ఫోటానికి అవసరమైన యురేనియం, న్యూట్రాన్ సమకూర్చుకున్నట్లు తమ నిఘా విభాగం సమాచారం అందించినట్లు ఐడీఎఫ్ వివరించింది. అయితే ఈ ఆరోపణను బలపరిచేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని అమెరికాకు చెందిన ఆయుధ నియంత్రణ సంస్థలోని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం డైరెక్టర్ కెల్సీ డావెన్‌పోర్ట్ చెప్పారు. “ఇరాన్ కొన్ని నెలల్లోనే అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తుందనే విశ్లేషణ కూడా కొత్తదేమీ కాదు” అని ఆయన అన్నారు.
అమెరికా నిఘా సంస్థలేమంటున్నాయి?
“ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయని” అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గాబర్డ్ ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో చెప్పారు. “అణ్వాయుధాలు లేని దేశానికి ఇది చాలా గొప్ప విషయం” అని ఆమె అన్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌కు మరో విషయం కూడా చెప్పారు.” అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడం లేదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అందుకు అనుమతి ఇవ్వలేదని” ఆమె చెప్పారు. “అణు విస్తరణ ముప్పు గురించి నెతన్యాహు వద్ద సమాచారం ఉండి ఉంటే, ఆయన అమెరికాతో పంచుకునేవారు. దీన్ని పక్కన పెడితే అలాంటి సమాచారం ఉంటే, ఇజ్రాయెల్ ఈపాటికే ఇరాన్‌లోని అణు స్థావరాలన్నింటిపైనా దాడులు చేసి ఉండేది” అని కెల్సీ డావెన్‌పోర్ట్ చెప్పారు. ఇరాన్ 60 శాతం స్వచ్ఛమైన, శుద్ధి చేసిన యురేనియం సేకరించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ గత వారం విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపింది.
ఇరాన్ అణు కార్యక్రమం గురించి మనకేం తెలుసు?
తమ అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందని, అణ్వాయుధాలను ఎన్నడూ తయారు చేయలేదని ఇరాన్ చెబుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ, 1980 నుంచి 2003 మధ్య ఇరాన్ ‘అణ్వస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి ‘ పనిచేసినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పదేళ్లపాటు చేసిన దర్యాప్తులో గుర్తించింది. 2009వరకు కూడా కొన్ని కార్యకలాపాలు కొనసాగించినట్టు గుర్తించింది. ఈప్రాజెక్టుకు “అమాద్” అని పేరు పెట్టారు.
Read Also: Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మండిపడుతున్న ముస్లిం దేశాలు