రాష్ట్రపతి భవన్ లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ వివాహ వేడుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుటుంబానికి చెందిన వారిది అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం రాష్ట్రపతి భవన్. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అంతటి ప్రత్యేకమైన స్థలంలో పెళ్లి వేడుకకు ఎందుకు అనుమతి ఇచ్చారో మీరే చదవండి.. ఒక సాధారణ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పెళ్లి కోసం ఈ స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. పూనమ్ గుప్తాకు జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న అవ్నీష్ కుమార్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 12న వీరిద్దరి వివాహం జరగనుంది.

పూనమ్ గుప్తా ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ హోదాలో పని చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు. ఈ క్రమంలోనే పెళ్లి ఆహ్వానం అందించే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి వివాహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకోవాలని సూచించారట.రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుక నిర్వహించుకోవాలని చెప్పారట. దీంతో ఈ అరుదైన అవకాశాన్ని పూనమ్ గుప్తా, అవ్నీష్ కుమార్, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా అంగీకరించారు. ఒక రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో దేశ చరిత్రలో మొదటి సారి రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి భాజా మోగనుంది.