తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, త్వరలోనే రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తాను హాజరవుతానని, ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా అసత్య ప్రచారాలపై ఆధారపడిందని, అది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని విమర్శించారు.
ప్రజలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గుర్తించారు
ప్రజలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని గుర్తించి, ఇప్పటికే విసుగుచెందారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్లు ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ హామీలలో ఎంత మేరకు నిజం ఉందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తానని తేల్చి చెప్పారు.

ఏప్రిల్ 27న వరంగల్‌లో భారీ సభ
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కీలక ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీలను నిలదీస్తామని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ పార్టీలు ఎవరో ప్రజలకు బహిరంగంగా తెలియజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జరగనున్న ఈ సభ తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుందని వివరించారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్
తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వంలో అందుకున్న అభివృద్ధి, సంక్షేమాన్ని తలచుకుంటే.. కాంగ్రెస్ పాలన ఎంత వెనుకబాటుగా ఉందో స్పష్టమవుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి బలంగా రాబోతుందని అభిప్రాయపడ్డారు.