ప్రపంచ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాల్లో అవతార్ ఒకటి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ విజువల్ మాస్టర్‌పీస్ సినిమాటిక్ విజువల్స్, అద్భుతమైన స్టోరీటెల్లింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2009లో వచ్చిన ‘అవతార్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.20,000 కోట్లకు పైగా వసూలు చేసి, ఇప్పటికీ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత 2022లో అవతార్: ది వే ఆఫ్ వాటర్ విడుదలై మరోసారి రికార్డులను తిరగరాసింది. ఇలాంటి గ్రాండ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినా, ఎవరు వదులుకుంటారు? కానీ బాలీవుడ్ యాక్టర్ గోవింద మాత్రం ‘అవతార్’లో నటించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

గోవింద – అవతార్ ఆఫర్ వెనుక కథ
ఓ ఇంటర్వ్యూలో గోవింద మాట్లాడుతూ, అవతార్ సినిమా నుంచి తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా తిరస్కరించాల్సి వచ్చిందో వివరించారు. అమెరికాలో ఉన్న ఓ సర్దార్జీకి నేను బిజినెస్ ఐడియా ఇచ్చాను. అది మంచి విజయాన్ని సాధించడంతో అతను నన్ను జేమ్స్ కామెరూన్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ నాకు డిన్నర్ ఏర్పాటు చేసి, ‘అవతార్’ లోని ‘స్పైడర్’ అనే కీలక పాత్రలో నటించమని ఆఫర్ ఇచ్చారు. ఈ పాత్రకు రూ.18 కోట్లు పారితోషికంగా ఇస్తామన్నారు. అయితే మొత్తం 410 రోజుల షూటింగ్ ఉంటుందని చెప్పారు. మొదట నేను అంగీకరించాను. కానీ శరీరానికి పూర్తి మేకప్ వేసుకోవాల్సి వస్తుంది అని తెలియగానే, అది నాకు సాధ్యం కాదని చెప్పేశాను. మీ 18 కోట్లు నాకు వద్దు. నేను అలాంటి మేకప్ వేయించుకుంటే ఆసుపత్రిలో చేరాల్సివస్తుంది అని వారికి చెప్పాను. తర్వాత ఆ పాత్రను పోషించిన నటుడిని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా నటించాడు. గోవింద చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 2025 డిసెంబర్ 19న ‘అవతార్ 3’ విడుదల కానుంది. ఇందులో పూర్తిగా నెగటివ్ నావీ తెగలు ఉండబోతున్నట్లు దర్శకుడు కామెరూన్ హింట్ ఇచ్చారు. అవతార్ 4 2029లో, అవతార్ 5 2031లో విడుదల కానున్నాయి.
ఇంత వరకు అవతార్ టీమ్ నుంచి గోవిందకు నిజంగా ఆఫర్ వచ్చిందా అనే దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ బాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్న గోవింద మళ్లీ తన పేరును హాట్ టాపిక్‌గా మార్చుకునేందుకు ఇలా మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఈ కథ నిజమైనా, అబద్ధమైనా – అవతార్ ఫ్రాంచైజీ సక్సెస్, హాలీవుడ్ సినిమాల స్థాయి, బాలీవుడ్ నటులకు విదేశీ అవకాశాల గురించి మాత్రం మళ్లీ చర్చ ప్రారంభమైంది. అవతార్ లాంటి విజువల్ వండర్‌లో నటించే అవకాశం వస్తే సాధారణంగా ఎవ్వరూ తిరస్కరించరు. కానీ గోవింద మాత్రం ఆఫర్‌ను వదులుకున్నానని చెప్పడం ఆశ్చర్యకరం. ఇది నిజమా? లేక బాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్న గోవింద మళ్లీ దృష్టిని తనపై కేంద్రీకరించుకోవడానికి చెప్పిన మాటలా? అన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే!