ప్రస్తుతం చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రంలో ఉండే కొన్ని రసాయనాలు శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్లకుండా లోపలే నిల్వ ఉండడం వల్ల కొన్ని స్పటికాలు ఏర్పడతాయి. ఈ స్పటికాలు క్రమంగా పెరిగి రాళ్లుగా మారతాయి. ముఖ్యంగా క్యాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ వంటి ఖనిజాలు అధికంగా పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడే రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణాలు
ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణమవుతాయి. నాన్-వెజిటేరియన్ ఆహారం అధికంగా తినడం, నీటిని తక్కువగా తీసుకోవడం, అధిక ఉప్పు ఉండే పదార్థాలను ఎక్కువగా వినియోగించడం ఈ సమస్యను పెంచే అంశాలుగా మారాయి. అదనంగా, విటమిన్ బీ6, సీ, డీ లలోపం, నిద్రలేమి, అనియంత్రిత భోజన సమయాలు కూడా కిడ్నీ రాళ్ల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. మధుమేహం (షుగర్), ఊబకాయం (ఒబేసిటీ) ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ప్రతిరోజూ తగినంత నీటిని తాగడం
కిడ్నీ రాళ్ల సమస్యను నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ తగినంత నీటిని తాగడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, మితంగా ఉప్పు, ప్రోటీన్‌ను తగ్గించడం అవసరం. వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇలా చిన్న మార్పులతోనే కిడ్నీ రాళ్ల సమస్యను ముందుగా నివారించుకోవచ్చు.