TG High court : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అటవీ భూములను తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి, చదును చేయడాన్ని వెంటనే ఆపాలని హైకోర్టులో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి
సర్వే నంబర్ 25లోని కంచ గచ్చిబౌలి అడవిలో 30–40 జేసీబీలతో సర్కార్ చెట్లను తొలగిస్తోంది. హింసాత్మక అటవీ నిర్మూలనను ఆపాలి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు..ప్రభుత్వం ఆ 400 ఎకరాలను చదును చేస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణ చేపట్టాలని తొలి పిల్ దాఖలు చేసిన వటా ఫౌండేషన్ (ఈఎన్‌పీవో) తరఫు న్యాయవాది ఒమర్ ఫారుక్.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనంరెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం విచారణ చేపట్టింది.
కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ
ఇరుణ పక్షాల వాదనలు విన్న కోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖ అధికారులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం కోరింది. కోర్టు తీర్పులకు లోబడే ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిజ నిర్ధారణ నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.