తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు అభ్యర్థులు ర్యాలీగా నినాదాలు చేస్తూ కాలేజ్ ప్రాంగణాన్ని సందడిగా మార్చారు. తక్షణమే గ్రూప్-1 ఫలితాలను నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మూడు కేంద్రాల నుంచి భారీ ఎంపికపై అభ్యంతరం
ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పరీక్షా కేంద్రాలుండగా కేవలం మూడు కేంద్రాల నుంచే 100 మందికి పైగా అభ్యర్థులు ఎంపికవడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎంపిక ప్రక్రియపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు ప్రాంతాల్లో విద్యార్థుల మెరుగైన ప్రదర్శనను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

తెలుగు భాషపై ప్రశ్నలు – విద్యార్థుల ఆవేదన
ఆందోళనలో మరో కీలక అంశంగా తెలుగుకు న్యాయం జరగడం లేదన్న భావన వ్యక్తమైంది. “తెలుగును నిషేధిస్తారా?” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు అధికారులపై నిరసన వెలిబుచ్చారు. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు. గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై ప్రభుత్వ స్పందన కోసం సమాజం ఎదురుచూస్తోంది.