G. Kishan Reddy : త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారని దక్షిణాది భాషల్లో సినిమాలకు హిందీలో విపరీతమైన ఆదరణ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాషల మధ్య అంతరాలను తొలగించేందుకు త్రిభాషా విధానం చాలా కాలంగా అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, ఎవరికైతే ఏ భాష కావాలనుకుంటే, అందులోనే చదివే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. భాష పేరుతో దేశాన్ని విభజించడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది అస్సలు సమంజసం కాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై విమర్శలు చేస్తూ, ఆయన తన పాలన గురించి చెప్పి ప్రజల నుంచి ఓట్లు అడగాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజల కోసం ఏమీ చేయకపోవడంతోనే స్టాలిన్ దుష్ప్రచారానికి దిగారని ఆరోపించారు.

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది పూర్తిగా అపార్థమని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం అమలవుతున్నట్లు వివరించారు. భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ, 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేసి స్టేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. విమానాశ్రయ స్థాయిలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, మొదటి విడతలో రూ. 26.55 కోట్ల వ్యయంతో పనులు సాగుతున్నాయని తెలిపారు.
రెండో విడత పనుల కోసం మరో రూ. 12 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు అపరిశుభ్రంగా ఉండేవని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ప్రయోజనాల కోసమేనని మంత్రి స్పష్టం చేశారు.